చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని

ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకున్న అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి ఒక మోయలేని భారంగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.


మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులతో వైసీపీ అధినేత జగన్ ను బూతులు తిట్టిస్తూ, అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.


రాజధాని అనేది సిరిసంపదలను ఇచ్చేలా ఉండాలి తప్ప, అప్పుల పాలు చేసేలా ఉండకూడదని పేర్కొన్నారు. 'మావిగన్' అనే ప్రతిపాదనతో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చని, దీనిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని గతంలో ఎన్టీఆరే స్వయంగా అన్నారని గుర్తుచేశారు. వెన్నుపోటు రాజకీయాలతో, ఎమ్మెల్యేలను కాసులతో కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. గతంలో ఆయన కేబినెట్‌లోని మంత్రులే ఆయనను తీవ్రంగా విమర్శించారని అన్నారు.

చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్ని నాని హెచ్చరించారు. అమరావతి విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్తులో రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Perni Nani
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh capital
YSRCP
Corruption allegations
Political criticism
AP Politics
Machilipatnam
Vijayawada

More Telugu News